కూసుమంచి మండలం శివాలయం సమీపంలో పొలంలో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది
కూసుమంచిలో విషాదం – పొలంలో నవజాత శిశువు మృతదేహం
_ఇంట్లోనే గర్భస్రావం జరిగి ఉంటుందని అధికారుల అనుమానం_

ఖమ్మం వాణి, కూసుమంచి, ఆగస్టు 13: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో బుధవారం ఉదయం విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక శివాలయం సమీపంలోని వ్యవసాయ పొలాల్లో నవజాత శిశువు మృతదేహం కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. విషయం తెలిసిన వెంటనే ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు మండల వైద్యాధికారి డా. సాయికుమార్ కు సమాచారం అందించారు. వెంటనే వైద్యాధికారి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
4 నుంచి 6 నెలల గర్భస్థ శిశువు
ప్రాథమిక పరిశీలనలో మృతదేహం 4 నుంచి 6 నెలల వయసున్న గర్భస్థ శిశువుదిగా గుర్తించారు. ఎవరో ఇంటి వద్దనే గర్భస్రావం చేయించి, ఆ తర్వాత మృత శిశువును పొలంలో పడేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.”ఎక్కడ గర్భస్రావం జరిగింది? ఎవరి సహాయంతో చేశారు? మృతదేహాన్ని ఎవరు పొలంలోకి తీసుకొచ్చి పడేశారు?” అనే కోణాల్లో విచారణ జరుగుతోందని డా. సాయికుమార్ తెలిపారు.
• పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే శిశువు ఖచ్చితమైన వయస్సు, మరణానికి గల కారణాలపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
