
తిరుమలాయపాలెం మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖమ్మం వాణి,తిరుమలాయపాలెం, ఆగస్టు 15: మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో లూథర్ విల్సన్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కూసుపూడి జగదీష్, ఎంపీడీవో కార్యాలయంలో షేక్ సిలార్ సాహెబ్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో నారెడ్డి సీతారాం రెడ్డి, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ కృపా ఉషశ్రీ, కస్తూరిబా కళాశాలలో ప్రిన్సిపాల్ కె. రమాకుమారి, వెటర్నరీ వైద్యశాలలో డాక్టర్ అనూష, విద్యుత్ శాఖ కార్యాలయంలో గడ్డం నరేందర్ రెడ్డి, ఇందిరా క్రాంతి పథకం కార్యాలయంలో సత్యనారాయణ రాజు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ పతాకాలను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచ్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఆయా గ్రామపంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు. గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.
